బీరం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాల నందు ప్రపంచ కళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 15 వ తేదీన ఆర్ట్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి, చైర్పర్సన్ సరస్వతమ్మ, డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ గార్లు పాల్గొన్నారు మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగివేమన యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డాక్టర్ కె. మృత్యుంజయ రావు గారు మరియు గ్రూప్-1 ఆఫీసర్ బీరం శ్రీకాంత్ రెడ్డి గారు విచ్చేశారు. మొదటగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సృజనాత్మకతతో కూడిన వివిధ రకాల కళాకృతులను, అందమైన చిత్రాలను, విభిన్న సంస్కృతులకు చెందిన అపురూప కళాఖండాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ, కళ అనగా కుంచెతో కన్నీటిని తెప్పించగలదు, సమాజాన్ని మెప్పించగలదు, సందేశాన్ని అందించగలదు,హృదయాన్ని కదిలించగలదు. అటువంటి కళల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ప్రతి సంవత్సరం సంవత్సరం ఈరోజును ప్రపంచ కళా దినోత్సవంగా జరుపుకుంటామని విద్యార్థులకు తెలియజేశారు. డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ప్రపంచ కళ దినోత్సవం మన జీవితంలో కళ యొక్క ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మకత మరియు సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తుందని,ఇది వివిధ కళాత్మక మాధ్యమాల ద్వారా మానవ కల్పన మరియు భావోద్వేగాల యొక్క విభిన్న వ్యక్తీకరణలను గౌరవించే రోజు అని తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచ కళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ సృజనాత్మకతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవాన్ని నిర్ణయించి కళా రంగానికి, కళాకారులకు తోడ్పాటును అందిస్తుందని, కళలు మానసిక ఆనందానికి, అభ్యున్నతికి, మరియు మనలో ఉన్న నైపుణ్యాలని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయని తెలియజేశారు. అలాగే డాక్టర్ కె.మృత్యుంజయ రావు గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పలు రకాల విద్యా కోర్సులకు లభిస్తునటువంటి ఆదరణ కళా రంగానికి దొరకడం లేదని, కానీ కళా రంగంలో నైపుణ్యత కనపరిచి విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు అని ఆయన తెలియజేశారు. కళల యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ కళలు అనేవి మన సంస్కృతి సాంప్రదాయాలకి నిదర్శనం అని వాటిని మన భవిష్యత్తు తరాలకి అందించడం మన బాధ్యత అని అలాగే కళాకారుల యొక్క గొప్పతనాన్ని వివరించి, వారికి తగిన ప్రోత్సాహం అందించి తమ కళల నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి తగిన అవకాశాలను కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మరియు కార్యక్రమంలో ప్రదర్శించినటువంటి కళా రీతులు అందరిని బాగా ఆకట్టుకున్నాయి. కొన్ని కళా రీతులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ముఖ్య అతిథులు విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్వేతా గారు మాట్లాడుతూ విద్యార్థులు కళల పట్ల మక్కువ పెంచుకొని, వాటిపై ఆసక్తి కనపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
బీరం ప్రాంగణంలోఆకట్టుకున్న ప్రపంచ కళా దినోత్సవ వేడుకలు..
RELATED ARTICLES