భారత్ న్యూస్
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పంపిణీ చేసిన గుడ్లు ఆకు పచ్చని రంగులో దర్శనమిచ్చిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కడప జిల్లా కమలాపురం పట్టణంలోని 20వ వార్డు తెలుగువీధిలోని గర్భిణీలు, పిల్లలకు, బాలింతలకు, కేంద్రానికి వచ్చే చిన్నారులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం కోసం అందించే కోడిగుడ్లు రంగుమారి కనిపించడం మహిళల్లో చర్చనీయాంశమయింది. కొన్ని ఏజెన్సీల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయిస్తోంది. అయితే ఏజెన్సీలు నాణ్యమైన గుడ్లను సరఫరా చేయకపోవడంతో పాటు కాలం చెల్లిన గుడ్లు దిగుమతి చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమలాపురం మున్సిపాలిటీలోని తెలుగువీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గుడ్లను పంపిణీ చేశారు. వాటిని ఇంటికి తీసుకువెళ్లిన లబ్ధిదారులు పగులగొట్టి చూడగా గుడ్లు పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చిన్నారులు తినే పోషకాహారంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నాణ్యమైన గుడ్లను పంపిణీ చేయాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై అంగన్‌వాడీ కార్యకర్త కిరణకుమారి మాట్లాడుతూ ఎక్కువ ఉడకపెట్టడం వలన రంగు మారిందన్నారు. సీడీపీవో సుజామణిని వివరణ కోరగా గుడ్లకు వేసే రంగు లోపలికి వెళ్ళి ఉండవచ్చని తిరిగి మరలా గుడ్డు ఇస్తామన్నారు.